దేశానికి మోడీ వంటి నియంత అవసరమే!

పాత నోట్ల రద్దుపై దేశ ప్రజలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో చిరంజీవి ఇంతవరకు స్పందించకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్, నాగబాబు కూడా భిన్నాభిప్రాయలు వ్యక్తం చేయడం విశేషం. ప్రధాని నరేంద్ర మోడీ తగినంత ముందస్తు ఏర్పాట్లు చేయకుండానే పాత నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, కనుక యుద్ద ప్రాతిపదికన తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ ట్వీటర్ ద్వారా సూచిస్తే, ఆయన సోదరుడు నాగబాబు అందుకు పూర్తి భిన్నంగా ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని చాలా గట్టిగా సమర్ధిస్తూ మాట్లాడటం విశేషం. 

దేశహితం కోసం నియంతృత్వం కూడా అవసరమే!

“అవినీతి, నల్లధనంతో భ్రష్టు పట్టిపోయిన దేశాన్ని మళ్ళీ బాగు చేయడానికి మోడీ వంటి బలమైన నాయకుడు అవసరరం. ఆయన నియంతలాగా వ్యవహరిస్తున్నప్పటికీ ప్రస్తుతం దేశాన్ని కాపాడుకోవాలంటే ఆయన అనుసరిస్తున్న పద్దతే సరైనది. ఈ దేశంలో స్వాతంత్ర్యం మరీ ఎక్కువైపోయింది. ఆ కారణంగా ఎవరు ఎవరినైనా విమర్శించడం ఫ్యాషన్ గా మారిపోయింది. దేశంలో నెలకొన్న ఈ అరాచక పరిస్థితులన్నిటినీ చక్కదిద్దలంటే మోడీ నియంతలాగా వ్యవహరించడం చాలా అవసరమే,” అని నాగబాబు అన్నారు.  

దేశం కోసం ఆ మాత్రం కాష్టం భరించక తప్పదు!

నోట్ల రద్దు కారణంగా దేశంలో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతూ, “చంటి పిల్లాడు నొప్పితో ఏడుస్తాడని ఏ తల్లైనా వాడికి టీకాలు, ఇంజక్షన్లులు చేయించకుండా చంపుకోవడానికి అంగీకరిస్తుందా? కాలికి గ్యాంగ్రిన్ సోకి కాలు కుళ్ళిపోతున్నప్పుడు, అది మిగిలిన శరీరం అంతటా వ్యాపించకుండా ఉండేందుకు ఎంత నొప్పయినా భరించి కుళ్ళిపోయిన ఆ కాలుని తీయించుకోమా? అలాగే దేశాన్ని చీడపురుగులా తొలిచివేస్తున్న నల్లధనం, అవినీతిని వదిలించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా చాలా మంచి నిర్ణయం తీసుకొన్నారు. అందుకు ఆయనని అభినందించకపోగా, చాలా మంది విమర్శిస్తున్నారు. తప్పులు ఎంచి చూపుతున్నారు. నోట్ల రద్దు వలన ఎదురవుతున్న సమస్యలని ఏకరువు పెడుతున్నారు. హూద్ హూద్ తుఫాను వచ్చినప్పుడు ఉత్తరాంద్రలో ప్రజలు నెలరోజుల పాటు ఇబ్బందులు పడ్డారు. ఎమర్జన్సీ కాలంలో అనేక నెలల పాటు దేశ ప్రజలు అందరూ ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు మన దేశాన్ని బాగు చేసుకొనేందుకు ఒక్క 50 రోజులు సమయం కావాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరుతున్నప్పుడు ఆయనకి ఆ మాత్రం సమయం కూడా ఇవ్వలేమా?” అని నాగబాబు ప్రశ్నించారు.

మోడీ దమ్మున్న మొగాడు!

“సామాన్యులు మొదలు కోటీశ్వరులు వరకు అందరి రోజువారి జీవితలలో అవినీతి కూడా భాగం అయిపోయింది. భారతదేశంలో అవినీతి వ్యవస్థీకృతం అయిపోయింది. స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ళ తరువాత దానిని వదిలించేందుకు ఒక దమ్మున్న మొగాడు.. ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు వస్తే ఆయనని అడ్డుకోవాలని మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ మొదలు అనేక మంది నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మోడీ అటువంటి ఒత్తిళ్ళకి లొంగే రకం కాదు. బహుశః ఆయన బాల్యం నుంచే ఈ దేశపరిస్థితిని చూసి చాలా బాధపడి ఉండవచ్చు. అందుకే దానిని మార్చాలని కంకణం కట్టుకొని అన్నిటికీ తెగించి ఇంత సాహసానికి పూనుకొని ఉండవచ్చు. ఈ ప్రయత్నంలో ఆయన సఫలం అవ్వాలని కోరుకొందాము. ఒకవేళ సఫలం అయితే దేశ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. దేశంలో మంచి మార్పులు రావడం మొదలువుతాయి. ఒకవేళ ఈ ప్రయత్నంలో ఆయన విఫలం అయినా అందుకు ఆయనని నిందించడం అనవసరం. ఇన్నేళ్ళ తరువాత ఇంత గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకోగలిగిన ప్రధాని మనకి దొరికి నందుకు సంతోషిద్దాం. 

భాజపాలో చేరే ఉద్దేశ్యం లేదు!

మోడీగారిని నేను అభిమానిని కాను. భాజపాలో చేరే ఉద్దేశ్యం కూడా లేదు. కానీ ఆయన తీసుకొన్న ఈ నిర్ణయాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఆయన నిజంగానే బురదలో నుంచి పుట్టిన తామరపువ్వు వంటి వారు. ప్రస్తుతం మన దేశాన్ని గాడిన పెట్టాలంటే అటువంటి బలమైన, దమ్మున్న నాయకుడే కావాలి. ఈ నోట్ల రద్దు నిర్ణయం వలన తాత్కాలికంగా మనం అందరం ఇబ్బందులు పడుతున్నా అవేమీ శాశ్వితంగా ఉండిపోయేవి కావు. కనుక దేశ హితం కోసం అందరం కొన్నిరోజులు ఈ ఇబ్బందులని భరిద్దాం. మన దేశాన్ని బాగుచేయడానికి ప్రయత్నిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి అండగా నిలబడదాం,” అని నాగబాబు అన్నారు.