కేసీఆర్‌కి రాజ్యాంగ వ్యవస్థలంటే గౌరవం లేదు: సిఎం రేవంత్

ఈరోజు శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “మాజీ సిఎం కేసీఆర్‌కి రాజ్యాంగ వ్యవస్థలంటే గౌరవం లేదు. అందుకే 2022లో గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించారు. కనుక 2023లో కూడా అలాగే నిర్వహించబోతే కోర్టు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితిలో గవర్నర్‌ని ఆహ్వానించాల్సి వచ్చింది. 

రాజ్యాంగాన్ని, దాని ద్వారా ఏర్పడిన వ్యవస్థలని, ఆ వ్యవస్థలని నడిపించేవారిని గౌరవించడం ప్రభుత్వాల కనీస ధర్మం. కానీ ప్రభుత్వం, అధికారం చేతిలో ఉంటే రాజ్యాంగానికి అతీతులమన్నట్లు కేసీఆర్‌ వ్యవహరించి భంగపడ్డారు. 

ప్రభుత్వం చేసిన, చేస్తున్న పనుల గురించి గవర్నర్ ప్రసంగంలో వివరించడం ఆనవాయితీ. దానినీ బిఆర్ఎస్ నేతలు తప్పు పడుతున్నారు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం గురించి మీరు వ్రాసి ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని గవర్నర్ చేత చదివించారు కదా?

అప్పుడు తప్పుగా అనిపించని మీకు ఇప్పుడు గవర్నర్ మా ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి చెపితే తప్పుగా కనిపిస్తోందా?ఆనాడు మహిళ అని కూడా చూడకుండా గవర్నర్‌ని మీరు ఎంత దారుణంగా అవమానించారో, అవహేళన చేశారో అందరూ చూశారు. ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోయినా కేసీఆర్‌, బిఆర్ఎస్ నేతల తీరు మారలేదని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటూనే ఉన్నారు,” అని సిఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు.