బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. మండలంలోని తొల్కట్ట గ్రామంలో ఆయనకు చెందిన ఫామ్‌హౌస్‌లో ఫిబ్రవరి 11న కోడి పందాలు, క్యాసినో నిర్వహించడంపై పోలీసులు సుమారు 4 గంటల సేపు ఆయనని ప్రశ్నించారు. ఆయనతో పాటు న్యాయవాది, ఆ ఫామ్‌హౌస్‌ని అద్దెకు తీసుకున్న వ్యక్తి కూడా వచ్చారు. కానీ పోలీసులు వారిరువురినీ లోనికి అనుమతించలేదు.
ఫామ్‌హౌస్‌లో కోడి పందాలు, క్యాసినో జరుగుతోందనే సమాచారంతో పోలీసులు దాడి చేసి మొత్తం 61 మందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఫామ్‌హౌస్ పోచంపల్లికి చెందినది కనుక పోలీసులు ఆయన పేరుని నిందితుల జాబితాలో చేర్చి నోటీస్ ఇచ్చారు.
పోలీస్ విచారణ తర్వాత బయటకు వచ్చిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఫామ్‌హౌస్ లీజు వివరాలు అడిగితే చెప్పాను. ఇది రాజకీయ కక్షతో పెట్టిన అక్రమకేసు అయినప్పటికీ విచారణలో పోలీసులకు సహకరిస్తాను,” అని చెప్పారు.