బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి పోలీస్ నోటీస్

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు నోటీస్ ఇచ్చారు. గత నెల తోల్కట్ట ఫామ్‌హౌస్‌లో కోడి పందేలు, కేసినో నిర్వహించిన కేసులో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.

కోడి పందేలు, కేసినోలో పాల్గొన్న 64 మందిని పోలీసులు ఈ కేసులో అదుపులో తీసుకున్నారు. ఆ ఫామ్‌హౌస్‌ యాజమాని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కావడంతో ఆయనను కూడా నిందితుడుగా చేర్చి విచారణకు రావాలంటూ నోటీస్ ఇచ్చారు. పోలీసులు బుధవారం సాయంత్రం మాదాపూర్‌లో ఆయన నివాసానికి వెళ్ళారు. కానీ ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో గోడకు నోటీస్ అంటించారు. 

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ కేసుపై స్పందిస్తూ తాను ఫామ్‌హౌస్‌ని ఓ వ్యక్తికి లీజుకి ఇచ్చానని కనుక దానిలో జరిగిన కోడి పందాలు, క్యాసినోతో తనకు ఎటువంటి సంబందమూ లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే తన పేరుని ఈ కేసులో చేర్పించిందని అన్నారు.