వరంగల్‌లో బిఆర్ఎస్ భారీ బహిరంగ సభ

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

బిఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరంలో అడుగుపెడుతుంది. కనుక ఏప్రిల్ 27న వరంగల్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్‌ సభకు తగిన స్థలం, ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతని పార్టీ సీనియర్ నేత హరీష్ రావుకు అప్పగించారు. ఆయనకు వేముల ప్రశాంత్ రెడ్డి సహకరిస్తారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలవారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి, పార్టీ శ్రేణులను, ప్రజలను, ముఖ్యంగా మహిళలను చైతన్యపరచాలని కేసీఆర్‌ సూచించారు. 

బిఆర్ఎస్ హయంలో అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం అభివృధ్ది చెందితే దానిని కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలలోనే భ్రష్టు పట్టించేసిందని, ప్రభుత్వం అసమర్థత వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పాలనతో విసుగెత్తిపోయున్న ప్రజలు కనుక మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరధం పడతారని కేసీఆర్‌ అన్నారు.         

తెలంగాణ ప్రజల సొంత పార్టీ బిఆర్ఎస్ కనుక ప్రజలందరినీ భాగస్వాములుగా చేసేందుకు ఏడాది పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రజతోత్సవ వేడుకలు నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రజా సమస్యలపై ప్రజలతో కలిసి పోరాడుతూ వారికి చేరువ కావాలని కేసీఆర్‌ సూచించారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళల మద్దతు పొందేలా బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ఉండాలని కేసీఆర్‌ సూచించారు. 

వరంగల్‌ సభ తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేసి గ్రామ స్థాయి నుంచి మళ్ళీ పార్టీ పునర్నిర్మించుకుందామని కేసీఆర్‌ చెప్పారు.