తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర రవాణా శాఖ మనటరీ పొన్నం ప్రభాకర్ ఓ శుభవార్త చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. దీని వలన ఆర్టీసీపై నెలకు రూ.3.6 కోట్ల అదనపు భారం పడుతుందని, అయినా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని 2.5 శాతం డీఏ ప్రకటించామని చెప్పారు.
రేపు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో 150 బస్సులను అద్దె ప్రాతిపదికన టిజిఎస్ ఆర్టీసీలోకి తీసుకోబోతున్నామని చెప్పారు. రెండో దశలో మరో 450 అద్దె బస్సులు మహిళా సంఘాల నుంచి తీసుకుంటామని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి పధకం కింద మహిళా సంఘాలు ఈ బస్సులు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి ఈ అద్దె బస్సులని ప్రారంభిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
మహాలక్ష్మి పధకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నారని, వారికి అందించిన ఈ సేవల విలువ సుమారు రూ.5,000 కోట్లు అని మంత్రి చెప్పారు. మహాలక్ష్మి పధకంలో ప్రతీరోజూ 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.