ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 9న పాతనోట్లని రద్దు చేసిన తరువాతనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనంతపురంలో బహిరంగ సభ నిర్వహించారు. అప్పుడు దాని గురించి పవన్ కళ్యాణ్ ఎటువంటి విమర్శలు చేయలేదు. కానీ 13 రోజులయినా ఇంకా ప్రజల నోట్ల కష్టాలు తీరకపోవడంతో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో ఒక మెసేజ్, దానితో బాటు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి తన స్నేహితుడు రచయిత సాయి మాధవ్ వ్రాసిన ఒక కవితని కూడా పోస్ట్ చేశారు.
అయితే నేటికీ పవన్ కళ్యాణ్ నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదు. కానీ ఆ నిర్ణయం ప్రకటించే ముందు కేంద్ర ప్రభుత్వం తగిన ముందస్తు ఏర్పాట్లు చేయలేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మోడీ తీసుకొన్న నిర్ణయం వలన వృద్ధులు, గ్రామీణులు, అసంఘటిత రంగంలో ఉన్న చిన్న చిన్న వ్యాపారులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కనీసం ఇప్పటికైనా కరెన్సీ కష్టాలు ఎప్పటిలోగా తీరుతాయనే విషయం ప్రజలకి తెలపాలని పవన్ కళ్యాణ్ కోరారు.
పాత నోట్ల రద్దు నిర్ణయాన్ని కొన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఒకవేళ కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా బ్యాంకులు, ఎటిఎంలు, పోష్టాఫీసులలో తగినన్ని కొత్త, చిన్న నోట్లు ప్రజలకి అందుబాటులోకి తేగలిగి ఉండి ఉంటే ఇన్ని విమర్శలు ఎదుర్కోవలసి వచ్చేది కాదు. ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని మొదట్లో స్వాగతించినవారు సైతం, 13 రోజులయినా ఈ నోట్ల కష్టాలు తీరకపోవడంతో ఇప్పుడు విమర్శిస్తున్నారు. వారి ఈ విమర్శల సంగతి ఎలాగున్నప్పటికీ, సామాన్యుల సమస్యలు ఇంకా ఇలాగే మరికొంత కాలం కొనసాగినట్లయితే ఊహించని సమస్యలు పుట్టుకురావచ్చు. కనుక ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్రప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టడం చాలా అవసరం. లేకుంటే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని బాధపడి ప్రయోజనం ఉండదు.