ఇకపై తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లకు ప్రాధాన్యత

మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన మూడు రోజులలోనే పార్టీలో మార్పులు చేర్పులు ప్రారంభించారు. ఆమె పార్టీలో పదవులు, నామినేటడ్‌ పోస్టుల పంపకాలకు కొత్త విధానం అమలుచేయాలని నిర్ణయించారు.

దీని కోసం పార్టీలో నాయకులను మూడు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్‌లో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు.

రెండో గ్రూప్‌లో ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినవారు.

మూడో గ్రూప్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక చేరినవారు ఉంటారని మీనాక్షి నటరాజన్ తెలిపారు.

కనుక ఇకపై ఈ విధానంలోనే పార్టీలో పదవులు, నామినేటడ్‌ పోస్టులు లాభిస్తాయని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఈ గ్రూపులకు అతీతంగా ఉంచాలని మీనాక్షి నటరాజన్ నిర్ణయించారు.          

ఆమె ఖచ్చితంగా ఈ విధానం అమలుచేయగలిగితే పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లభిస్తుంది కనుక మళ్ళీ పదవులు, వాటితో పాటు కోల్పోయిన గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి.

కానీ సిఎం రేవంత్ రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌, సీనియర్ కాంగ్రెస్‌ నేతలను కాదని ఈవిధానంలో పార్టీ నేతలకు పదవులు కేటాయించడం ఆమెకు సాధ్యమేనా?అనే సందేహం కలుగుతుంది. కనుక ఆమె ఈ విధానాన్ని ఏ మేరకు అమలుచేయగలరో త్వరలో పదవులు పంపకాలు జరిగినప్పుడు తెలుస్తుంది.