మామునూరులో రైతులు నిరసనలు

వరంగల్‌ జిల్లా మామూనూరు విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు అందరూ సంతోషిస్తుంటే, తమ భూములు కోల్పోతామని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఉదయం జిల్లాలోని నక్కలపల్లి, గాడిపెల్లి, గుంటూరుపల్లి, ల్ల కుంట గ్రామాలకు చెందిన సుమారు 200 మంది రైతులు ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేశారు.

మామూనూరు విమానాశ్రయం నిర్మాణం కొరకు తమ భూములు ఇస్తామని, కానీ మార్కెట్‌ ధర చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కానీ భూములకు తగిన ధర చెల్లించకుండా, తమ భూములు సర్వే చేసేందుకు ప్రయత్నిస్తే తప్పకుండా అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు. 

నిర్వాసితులలో ఓ రైతు మీడియాతో మాట్లాడుతూ, “విమానాశ్రయం కోసం మా ఊర్లో 175 ఎకరాలు తీసుకున్నారు. ఏకరాకు రూ.5 కోట్లు చొప్పున ఇవ్వాలని, విమానాశ్రయాన్ని కలుపుతూ వేసే రహదారి మా ఊరిమీదుగా వేయాలని కోరుతున్నాము,” అని చెప్పారు.  

జిల్లా, రాష్ట్రాభివృద్ధికి, అవసరాలకు మామూనూరు విమానాశ్రయం అవసరమే. కానీ దాని కోసం తమ జీవనోపాదినిచ్చే భూములను త్యాగం చేసే రైతులకు నష్టపోకుండా ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించడం చాలా ముఖ్యం.

గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల కొరకు భూసేకరణ చేసి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించలేదని కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలే తరచూ విమర్శిస్తుంటారు. కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వం అటువంటి తప్పు చేయకూడదని రైతులు ఆశించడం తప్పు కాదు కదా?