ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రమాదం జరిగి అప్పుడే 9 రోజులయ్యింది. కానీ ఇంతవరకు సిఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా అక్కడకు వెళ్ళి పరిస్థితి తెలుసుకొని, బాధిత కుటుంబాలను పరామర్శించలేదని బిఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకుంటే, అదేమీ పట్టన్నట్లు సిఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. మంత్రులు ఏదో పిక్నిక్‌కి వచ్చిపోతున్నట్లు హెలికాఫ్టర్లలో వచ్చిపోతున్నారు తప్ప సహాయ చర్యలు సక్రమంగా చేయించడం లేడని హరీష్ రావు విమర్శించారు.
బిఆర్ఎస్ పార్టీ నేతల విమర్శల వల్లనో లేదా నేడు సొరంగంలో నుంచి నాలుగు మృతదేహాలను వెలికితీస్తున్నట్లు సమాచారం అందినందునో సిఎం రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఎస్ఎల్‌బీసీ సొరంగం వద్దకు రాబోతున్నారు.
ఎస్ఎల్‌బీసీ సొరంగం పనులను పర్యవేక్షిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ ఈవిషయం తెలియజేశారు. గత 8 రోజులుగా పగలు రాత్రి అనే తేడా లేకుండా సొరంగం క్లియర్ చేయడానికి అందరూ తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పారు.
కన్వేయర్ బెల్ట్ మరమత్తు చేసి దానిపై లోపల నుంచి వ్యర్ధాలు, శిధిలాలను బయటకు తరలిస్తున్నామని చెప్పారు. లోకో మోటివ్ బోగీల ద్వారా కూడా శిధిలాలను, గ్యాస్ కటింగ్ చేసి తీసేసిన టన్నల్ బోరింగ్ యంత్రం ముక్కలను బయటకు తరలిస్తున్నామని చెప్పారు.
లోపల నీరు, బురద తోడేశామని, మూడడుగుల బురదలో కూరుకుపోయి మరణించిన కార్మికుల మృతదేహాలు బయటకు తీసే ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి సిఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ, సహాయ చర్యలకు అవసరమైన సిబ్బందిని, యంత్రాలను ఏర్పాటు చేసి పంపిస్తూనే ఉన్నారని వంశీ కృష్ణ చెప్పారు.