రేవంత్ విడిచిపెట్టినా కేంద్రం విడిచిపెట్టదు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పూర్తికాకుండా కేంద్రం అడ్డుపడుతూ కేసీఆర్‌ని కాపాడతోందంటూ సిఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

“ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క స్థానంలో పోటీ చేస్తోంది. అంటే సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందే ఓటమి అంగీకరించేశారన్న మాట! 

ఆ భయంతోనే బీజేపి-బిఆర్ఎస్ పార్టీల రహస్య అవగాహన ఉందని, కేసీఆర్‌ని ప్రధాని మోడీ కాపాడుతున్నారని అబద్దాలు చెపుతున్నారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసుని రేవంత్ రెడ్డి పట్టించుకోకపోయినా కేంద్ర ప్రభుత్వం విడిచిపెట్టదు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ మేమే (బీజేపి) హైకోర్టులో కేసు వేశాము. ఈ కేసులో దోషులకు శిక్ష పడాలని రేవంత్ రెడ్డి నిజంగా కోరుకుంటున్నట్లయితే, తక్షణం ఈ కేసుని సీబీఐకి అప్పగించాలి. 

రేవంత్ రెడ్డి సర్వేలు, రిజర్వేషన్స్ పేరుతో ఎన్నికల రాజకీయాలు మొదలుపెట్టారు. కానీ ముస్లింలని బీసీలలో కలిపి బీసీలకు అన్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తే మేము తప్పకుండా వ్యతిరేకిస్తాము,” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.