ఎస్ఎల్‌బీసీ సొరంగంలో శనివారం జరిగిన ప్రమాదంలో 8 మంది ఇంకా లోపలే చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ ప్రయత్నిస్తూనే ఉంది. ఆర్మీకి చెందిన ఇంజనీర్లు, సిబ్బంది కూడా రంగంలో దిగారు. నాగర్ కర్నూల్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఉదయం సొరంగలో ప్రమాదం జరిగిన ప్రదేశం వరకు ట్రాలీ వాహనంలో వెళ్ళి పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం బయట మీడియాతో మాట్లాడుతూ, “ఇది ప్రమాదమే తప్ప మానవ తప్పిదం కాదు. ఇంజనీర్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఊహించని స్థాయిలో నీళ్ళు లీక్ అవడంతో సొరంగం పైకప్పు కూలిపోయింది. కానీ దీనిపై బిఆర్ఎస్ పార్టీ నేతలు రాజకీయాలు చేస్తుండటం చాలా బాధాకరం.
లోపల చిక్కుకుపోయినవారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనుక రాజకీయాలు పక్కన పెట్టి వారు క్షేమంగా బయటకు తిరిగిరావాలని అందరూ భగవంతుడిని ప్రార్ధిస్తే బాగుంటుంది,” అని అన్నారు.