ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడిన పర్వేష్ వర్మ మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ సిఎం, డెప్యూటీ సిఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపి రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
రేఖా గుప్తా తల్లి తండ్రులు ఆమె బాల్యంలోనే ఉద్యోగరీత్యా హర్యానా నుంచి ఢిల్లీకి వచ్చి స్థిరపడటంతో ఆమె విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే పూర్తయింది. విద్యార్ధి దశ నుంచే బీజేపికి అనుబందంగా పనిచేసే ఏబీవీపీలో చురుకుగా పాల్గొన్నారు. ఆ తర్వాత బీజేపిలో చేరి అంచెలంచెలుగా ఎదిగి నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
నిన్న బీజేపి శాసనసభాపక్ష సమావేశానికి బయలుదేరుతున్నప్పుడు కూడా తనని ఈ పదవికి ఎన్నుకోబోతున్నారనే విషయం తెలియదని రేఖా గుప్తా చెప్పారు. తనకు ఇంత కీలక బాధ్యతలు అప్పగించినందుకు ప్రధాని మోడీకి అమిత్ అమిత్ షా, బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆమె కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
దేశంలో 15 రాష్ట్రాలలో బీజేపి అధికారంలో ఉంది. ఏపీతో సహా మరో 6 రాష్ట్రాలలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. కానీ ఏ రాష్ట్రంలో మహిళా ముఖ్యమంత్రి లేరు. కనుక బీజేపి మహిళలను చిన్నచూపు చూస్తోందనే అపవాదుని వదిలించుకోవాలనుకుంది. రేఖ గుప్తా తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎంపికైనప్పటికీ ఇదే ఆమెకు కలిసి వచ్చింది.