తెలంగాణ మాజీ సిఎం, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దాదాపు 15 నెలల తర్వాత మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అయ్యారు.
ఈరోజు తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ, “కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేవలం 15 నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలలో వెనక్కుపోయింది.
తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు బిఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష. ఎందుకంటే ప్రజల కష్టాలు, అవసరాలు బిఆర్ఎస్ పార్టీకి మాత్రమే తెలుసు. మనకి మాత్రమే చిత్తశుద్ధి ఉంది కనుక. బిఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ 25 ఏళ్ళలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ ముందుకే సాగాము. కనుక అదే స్పూర్తితో మరోసారి అందరం కలిసికట్టుగా ప్రజల తరపున పోరాడి ఈ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.
ఈసారి గట్టిగా కోట్లాడితే నూటికి నూరు శాతం మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాము,” అని కేసీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ స్థాపన మొదలు నేటి వరకు బిఆర్ఎస్ పార్టీ ప్రస్థానం గురించి అందరికీ వివరించారు. ఏప్రిల్ 27న పార్టీ రజతోత్సవం సందర్భంగా భారీ బహిరంగసభ ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. ఆలోగా సంస్థాగత కమిటీలు ఏర్పాటు, సభ్యత్వ నమోదు కార్యక్రమం వంటివి చేపట్టాలని కేసీఆర్ సూచించారు.