బుధవారం ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం

ఇటీవల జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపి ఘన విజయం సాధించడంతో ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దంఅవుతోంది. ముందుగా రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు రామ్ లీలా మైదానంలో అట్టహాసంగా  ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

కానీ ఇంతవరకు ముఖ్యమంత్రి పేరు ప్రకటించలేదు. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం బీజేపి పెద్దల సమక్షంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శాసనసభపక్ష నేతని అంటే ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకుంటారు. ఆ పదవికి పలువురు సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఈసారి మహిళా ముఖ్యమంత్రి ఉండవచ్చనహీ తెలుస్తోంది. 

పలువురు బీజేపి సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రామ్ లీలా మైదానంలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీ, అమిత్ షాలతో సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిద రాష్ట్రాల నుంచి బీజేపి సీనియర్ నేతలు హాజరు కానున్నారు. పలువురు దేశ విదేశీ ప్రముఖులు, సినీ, పారిశ్రమిక తదితర రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.