బీజేపిలో ఉండలేకపోతున్నా: రాజాసింగ్

బీజేపి ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హటాత్తుగా ఓ బాంబు పేల్చారు. మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర బీజేపిలో రాజకీయాలతో విసుగెత్తిపోయింది. గోల్కొండ నియోజకవర్గం ఇన్‌-ఛార్జీగా ఓ బీసీ నేతని నియమించాలని నేను మా పార్టీలో కీలకవ్యక్తికి ఫోన్ చేసి చెప్పాను. కానీ ఆయన నా మాట పట్టించుకోకుండా మజ్లీస్ నేతలతో రాసుకుపూసుకు తిరిగే వ్యక్తికి ఆ పదవి కట్టబెట్టారు. 

పార్టీలో సీనియర్ నాయకుడిని, ఎమ్మెల్యేనన్న గౌరవమే లేదు ఎవరికీ. పార్టీలో నా మాటకు విలువే లేదు. ఓ పక్క కాంగ్రెస్‌ పార్టీతో నిరంతరం యుద్ధం చేస్తూనే ఉన్నాను. మరోపక్క పార్టీలో అంతర్గతంగా కూడా యుద్ధాలు చేయాలంటే నా వల్ల కాదు. పార్టీలో ఈ పరిస్థితి చూసి విసుగొచ్చేస్తోంది. ఒకవేళ పార్టీకి నా అవసరం లేదని చెప్పేస్తే రాజీనామా చేసి వెళ్ళిపోతాను. ఇలా నన్ను వేధించవద్దు,” అని అన్నారు. 

పార్టీ పడవులలో నియామకాలు చేపట్టే అధికారం రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికే ఉంది. కనుక రాజాసింగ్ చెప్పిన ఆ కీలక వ్యక్తి కిషన్ రెడ్డే కావచ్చు. పార్టీలో తన మాటకు విలువలేదని రాజాసింగ్ స్వయంగా చెప్పుకున్నారు. కనుక రాజీనామా చేసి వెళ్ళిపోతానంటే ఎవరైనా పట్టించుకుంటారా? డౌటే!