జకీర్ నాయక్ సంస్థలలో ఎన్.ఐ.ఎ. దర్యాప్తులు

నిషేదిత ఇస్లామిక్ రీసర్చ్ ఫౌండేషన్ (ఐ.ఆర్.ఎఫ్.)అధినేత జకీర్ నాయక్ కి చెందిన 10 సంస్థలపై జాతీయ దర్యాప్తు (ఎన్.ఐ.ఎ.)బృందాలు శనివారం ఉదయం ఏక కాలంలో సోదాలు నిర్వహించాయి. అంతకు ముందురోజు అంటే శుక్రవారం రాత్రి జాకీర్ నాయక్ పై ముంబైలోని ఒక స్థానిక పోలీస్ స్టేషన్లో ఎన్.ఐ.ఎ. పిర్యాదు మేరకు పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. జకీర్ నాయక్ దేశంలో విభిన్న మతాల ప్రజలని రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్నాడని ఆరోపిస్తూ సెక్షన్ 153 (ఎ) క్రింద కేసు నమోదు చేశారు. జకీర్ నాయక్ సంస్థల నుంచి ఎన్.ఐ.ఎ. అధికారులు కొన్ని కీలకపత్రాలని స్వాధీనం చేసుకొన్నారు. 

విదేశాల నుంచి ఆ సంస్థలకి బారీగా నిధులు అందుతున్నట్లుగా ఎన్.ఐ.ఎ. అధికారులు గుర్తించారు. వాటిని జకీర్ నాయక్ తన పీస్ టీవి ఛానల్ కి మళ్ళించి, దాని ద్వారా దేశంలోని ముస్లిం యువతని రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసేవాడు. పీస్ టీవీలో అతని ప్రసంగాలు చాలా కాలంగా సాగుతున్నప్పటికీ, వాటిని భారత ప్రభుత్వం చాలా కాలం గమనించనే లేదు. కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్ లో ఒక హోటల్ పై ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు, వారిలో కొందరు తాము జకీర్ నాయక్ ప్రసంగాలు వినే ఉగ్రవాదులుగా మారమని చెప్పుకొన్నారు. ఆ తరువాతే భారత్, బాంగ్లా ప్రభుత్వాలు మేల్కొని జకీర్ నాయక్ నడిపిస్తున్న పీస్ టీవీని, అతని సంస్థలపై నిషేధం విదించాయి. భారత్ లో తనపై కేసులు నమోదు అవడంతో జకీర్ నాయక్ విదేశాలకి పారిపోయాడు. ప్రస్తుతం దుబాయి లేదా సౌదీ అరేబియాలో ఉంటున్నట్లు సమాచారం. అతని సంస్థలలో ఎన్.ఐ.ఎ. సోదాలు నిర్వహించిన తరువాత, అతని పేరిట అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం.