సరిగ్గా నాలుగేళ్ళ క్రితం ఇదే నెలలో హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్న గట్టు వామనరావు, నాగమణి దంపతులను పెద్దపల్లి-మంధని మద్య కొందరు దుండగులు దారికాచి పట్టపగలు నడి రోడ్డుపై కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు.
హైకోర్టు న్యాయవాదులు పట్టపగలు నడిరోడ్డుపై హత్యకు గురవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇటువంటి కేసు కూడా నేటికీ ఇంకా విచారణ కొనసాగుతూనే ఉండటం నిందితులకు శిక్షలు పడకపోవడం ఇంకా బాధాకరం. ఈ కేసుపై విచారణ వేగంగా, పారదర్శకంగా జరగడం లేదంటూ వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
జస్టిస్ సుందరేశ్, జస్టిస్ రాజేశ్ బిందాల్ కూడిన ద్విసభ్య సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసు విచారణకు చేపట్టినప్పుడు, ఈ కేసుని సీబీఐకి అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టు తెలియజేయగా, సుప్రీంకోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేసేందుకు సిద్దంగా ఉందని సీబీఐ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకి తెలిపారు.
కానీ ఈ కేసులో నిందితుడుగా ఉన్న పుట్ట మధు తరపున న్యాయవాది అభ్యంతరం చెపుతూ, ఈ హత్యతో పుట్ట మధుకి ఎటువంటి సంబందమూ లేదని కానీ రాజకీయ ఒత్తిళ్ళ కారణంగా పోలీసులు అతని పేరుని ఈ కేసులో చేర్చారని వాదించారు.
వామనరావు మరణ వాంగ్మూలంలో కూడా పుట్ట మధు పేరు చెప్పలేదనే విషయం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళి తమకు కొంత సమయం ఇస్తే ఆ రికార్డులు సుప్రీంకోర్టుకి సమర్పిస్తానని చెప్పారు. ఆయన అభ్యర్ధన మేరకు ఈ కేసు విచారణని రెండు వారాలకు వాయిదా వేసింది.