వర్మ విచారణకు వెళ్తారా లేదో?

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఏపీలో మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో గత ఏడాది నవంబర్‌ 10న కేసు నమోదు అయ్యింది. 

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం రాంగోపాల్ వర్మ ‘వ్యూహం’ అనే ఓ సినిమా తీశారు. దానిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్రలు, కుతంత్రాలు చేసే వ్యక్తిగా చూపారు. ఆ సినిమా ప్రమోషన్స్‌లో కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిరువురి ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావాలంటూ గత ఏడాది నవంబర్‌ 19న ఒకసారి మళ్ళీ 25న మరోసారి నోటీసులు పంపించారు. కానీ ఆయన విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి, హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ పొందిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ తనదైన శైలిలో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. 

ఫిబ్రవరి 4న విచారణకు హాజరవ్వాలని పోలీసులు మళ్ళీ నోటీసులు పంపగా ఆరోజు బిజీగా ఉంటానని ఫిబ్రవరి 7న అంటే ఇవాళ్ళ హాజరవుతానని రాంగోపాల్ వర్మ పోలీసులకు తెలిపారు. 

తనని అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్‌ పొందిన్నప్పటికీ రాంగోపాల్ వర్మ విచారణకు హాజరయ్యేందుకు జంకుటున్నారు. పోలీసులు విచారణ పేరుతో తనని కొడతారనే  తాను జంకుతున్నానని ఆయన ఇదివరకు ఓసారి చెప్పారు.

కనుక ఇవాళ్ళైనా ఆయన విచారణకు హాజరావుతారో లేదో అనుమానమే. ఒకవేళ హాజరుకాకపోతే విచారణకు సహకరించకుండా బెయిల్‌ షరతు ఉల్లంఘించినందుకు కోర్టు చేత నాన్-బెయిలబుల్ అరెస్ట్‌ వారెంట్ జారీ చేసే అవకాశం ఉంది.