రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత తొలిసారిగా జనవరి 27న రైతు భరోసా నిధులు విడుదల చేసింది. మళ్ళీ నిన్న రెండో విడతలో ఎకరం లేదా అంత కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతుల ఖాతాలలో  రూ.593 కోట్లు రైతు భరోసా సొమ్ము జమా చేసింది.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఈ పధకం  కోసం రెండు విడతలలో కలిపి మొత్తం రూ.1,126.54 కోట్లు రైతులకు చెల్లించాము. దీని వలన రాష్ట్రంలో 21,45,330 మంది రైతులు లబ్ధి పొందారు. త్వరలోనే మిగిలినవారికి కూడా రైతు భరోసా చెల్లిస్తాము. ఇప్పటికే రుణమాఫీకి రూ. 20,616.89 కోట్లు, రైతు భీమాకు రూ.3,000 కోట్లు విడుదల చేశాము. 

గత యాసంగిలో రూ.10,547 కోట్లతో 48.06 లక్షల టన్నులు వరి ధాన్యం కొనుగోలుచేశాము. తర్వాత వానాకాలంలో రూ.12,178.97 కోట్లతో మరో 52.51 లక్షల టన్నులు కొనుగోలు చేశాము. రూ.406.24 కోట్లతో కంది, పెసర, సోయాబీన్ తదితర పంట ఉత్పత్తులను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేశాము. మా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది,” అని మంత్రి తుమ్మల చెప్పారు.