సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమగ్ర కుల గణన నివేదికపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీసీ సంఘాల నేతలు ఉద్యమాలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్‌మార్ మల్లన్న కూడా ఈ నివేదికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ దాని ప్రతికి నిప్పు అంటించి తగులబెట్టి నిరసన తెలిపారు.
అంతేకాదు.. తన అభిప్రాయం చెపుతూ ప్రతిని తగులబెడుతుండగా తీసిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కూడా. దీంతో సిఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, సీనియర్ నేతలు తీన్‌మార్ మల్లన్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేడు గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “పార్టీలో ఉండాలనుకునేవారు తప్పనిసరిగా పార్టీకి కట్టుబడి ఉండాల్సిందే. పార్టీకి వ్యతిరేకంగా లేదా నష్టం జరిగేలా వ్యవహరించినా మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు,” అని అన్నారు.
రేపు గాంధీ భవన్‌లో సిఎం రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. బహుశః అప్పుడే లేదా ఆ సమావేశాలు ముగిసిన తర్వాత తీన్‌మార్ మల్లన్నపై వేటు వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
ఇంతకాలం సిఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తీన్‌మార్ మల్లన్న మాట్లాడినా ఉపేక్షించారు. కానీ ఇప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా మాట్లాడటంతో ఇక ఉపేక్షించకపోవచ్చు.