కుల గణన దేశానికి ఆదర్శం.. కాదంటున్న బీసీ నేతలు!

సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నిన్న శాసనసభలో కుల గణన సర్వే నివేదికపై మాట్లాడుతూ “దీంతో రాష్ట్రంలో అద్భుతాలు జరుగబోతున్నాయి దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇది స్పూర్తిదాయకం.. దీని వలన ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కులగణన చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది..” అంటూ చాలా గొప్పగా చెప్పుకున్నారు. 

కానీ రాష్ట్రంలో బీసీలకు దీని వలన తీరని అన్యాయం జరుగుతుందని బీసీ సంఘాల నేతలు వాదిస్తున్నారు. అప్పుడే సమావేశాలు నిర్వహించుకొని కులగణన సర్వే నివేదికని వ్యతిరేకిస్తూ దాని కాపీలను తగులబెడుతున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు, ధర్నాలు, దీక్షలు చేసేందుకు సిద్దమవుతున్నారు. 

బీసీ సంఘాల జేఏసీ ఛైర్మన్‌ కుందారం గణేష్ చారి అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశలో పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కుల గణన నివేదిక ప్రతులను చించివేసి చెత్తబుట్టలో పడేసి దీనికి ఇంతకు మించి విలువలేదన్నారు. 

గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా సమావేశాలు, దీక్షలు, ధర్నాలు నిర్వహిస్తూ ఫిబ్రవరి నెలాఖరున లక్షలాది మంది బీసీలతో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. 

కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ  నివేదికని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పి, దాని ప్రతిని కాల్చేసి నిరసన తెలిపారు. 

కనుక కులగణనతో సిఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై పైచేయి సాధిస్తారా లేక కొత్త సమస్యని సృష్టించుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.