బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు.
దానిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం వారం రోజులలోగా జవాబు ఇవ్వాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ప్రశ్నిస్తుండటంతో శాసనసభ కార్యదర్శి బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు నేడు నోటీసులు పంపి వివరణ కోరారు.
అయితే ఈ నోటీసులు పంపడం, దనాయికి వారందరూ వివరణ ఇవ్వడం వంటివన్నీ కాలయాపనకు చేసేందుకే తప్ప వారిపై అనర్హత వేటు వేసేందుకు కాదని రాజకీయ అవగాహన ఉన్న ఎవరైనా చెప్పగలరు. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకి నోటీసులు జారీ చేశామని, వారి వివరణ కోసం ఎదురుచూస్తున్నామని సుప్రీంకోర్టుకి చెప్పుకోవచ్చు.
కానీ సుప్రీంకోర్టు మొట్టి కాయలు వేస్తోంది కనుక త్వరలోనే 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయక తప్పదని, త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని, వాటిలో మనమే గెలుస్తామని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పగటి కలలు కంటున్నారు.
కానీ ఈ నోటీసులు, ఎమ్మెల్యేల వివరణ పేరుతో చాలా సులువుగా మరో రెండు మూడు నెలలు ఈ కేసుని సాగదీసేయవచ్చని అందరికీ తెలిసిందే. ఒకవేళ బిఆర్ఎస్ పార్టీ ఏ కారణం చేతైనా మరింత బలహీనపడినా లేదా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉందని భావించినప్పుడే ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత కాంగ్రెస్ అధిష్టానం రాజీనామాలు చేయిస్తుంది తప్ప సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందనో లేదా కేటీఆర్ ఆశపడుతున్నారనో మాత్రం కాదు.