కేసీఆర్‌! ముందు లేచి సరిగ్గా నిలబడు: రేవంత్

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఇంతకాలం ఫామ్‌హౌస్‌లో మౌనంగా ఉండిపోవడం వలన రాష్ట్ర రాజకీయాలు చాలా చప్పగా సాగుతున్నాయి. కానీ ఆయన నిన్న నోరు విప్పి రెండు ముక్కలు మాట్లాడగానే ఒక్కసారిగా అన్నంలో మసాలా దినుసులు కలిపితే బిర్యానీగా మారినట్లు రాజకీయాలు ఘాటుగా మారాయి. 

“నేను ఫామ్‌హౌస్‌లో ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాలను మౌనంగా, గంభీరంగా చూస్తున్నా. నాకు చిన్నగా దెబ్బ కొట్టే అలవాటు లేదు. కొడితే చాలా గట్టిగానే కొడతాను,” అంటూ రేవంత్ రెడ్డి పాలనపై కేసీఆర్‌ నిన్న తీవ్ర విమర్శలు చేశారు. 

వాటిపై వెంటనే సిఎం రేవంత్ రెడ్డి అంతకంటే ఘాటుగా స్పందించారు. రంగారెడ్డి జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మాట్లాడుతూ, “కేసీఆర్‌ నువ్వు కొట్టుడు కాదు ముందు లేచి తిన్నగా నిలబడేందుకు ప్రయత్నించు. 

మాజీ కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన నీకు సోషల్ మీడియాలో నాకంటే ఎక్కువ లైక్స్ వచ్చాయని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించడం లేదా?సల్మాన్ ఖాన్, రాఖీ సావంత్ ఇద్దరికీ పోటీ పెడితే రాఖీ సావంత్‌కే ఎక్కువ లైకులు వస్తాయి. అంతమాత్రాన్న సల్మాన్ ఖాన్ హీరో కాకుండా పోతాడా?

నువ్వు శాసనసభకు రాకుండా ఫామ్‌హౌస్‌లో పడుకొని కేటీఆర్‌ని, హరీష్ రావుని ఊరి మీదకు వదిలావు. వారిద్దరూ కలిసి బిఆర్ఎస్ పార్టీని నాశనం చేసేస్తుంటే నువ్వు అక్కడ పడుకొని గంభీరంగా చూస్తున్నావా? 

ఫామ్‌హౌస్‌ రాజకీయాలు చేసే నీకు ప్రజలతో ఎప్పుడో సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు నువ్వు లోపల ఉన్నా బయటకు వచ్చినా పెద్ద తేడా ఏమీ ఉండదు. నువ్వో చెల్లని వెయ్యి రూపాయల నోటు వంటివాడివి. అయినా నీ కోసం ప్రజలు ఎవరూ ఎదురుచూడటం లేదు. 

ఫామ్‌హౌస్‌లో పడుకొని గంభీరంగా చూస్తున్నానని చెప్పుకునే బదులు అదేదో శాసనసభ సమావేశాలకు వచ్చి చెప్పొచ్చు కదా?అక్కడే నువ్వో నేనో తేల్చేసుకుందాము,” అని సిఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌కి సవాలు విసిరారు.