టిజిఎస్ ఆర్టీసీ నేతలు యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చినా స్పందించకపోవడంతో వారు రాష్ట్రంలో వివిద పార్టీలను, వర్గాల నేతలను కలిసి సమ్మె చేస్తే మద్దతు ఇవ్వాలని అభ్యర్ధిస్తున్నారు. శుక్రవారం వారు ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగని కలిసి సమ్మె చేస్తే మద్దతు ఇవ్వాలని కోరారు. తర్వాత సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి భాస్కర్‌ని కూడా కలిసి మద్దతు కోరారు.
తాము సమ్మె చేయాలని కోరుకోవడం లేదని కానీ టిజిఎస్ ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలోనే సమ్మె చేయడానికి సిద్దపడుతున్నామని చెప్పారు. విద్యుత్ బస్సుల పేరుతో టిజిఎస్ ఆర్టీసీని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని దాని వలన ఆర్టీసీ మూతపడి కార్మికులు అందరూ రోడ్డున పడే ప్రమాదం పొంచి ఉందని వివరించారు. వారు ఎదుర్కొంటున్న అదనపు పని భారం, ఇతర సమస్యల గురించి వివరించి తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
టిజిఎస్ ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ ఛైర్మన్ ధామస్ రెడ్డి, మజీద్, కమాలకర్ గౌడ్, మౌలానా తదితర నేతలు మంద కృష్ణ మాదిగ, పి భాస్కర్‌లను కలిసి మద్దతు అడిగారు.