తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ

సంగారెడ్డిలో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర మహాసభలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజున తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీని ఏకగ్రీవంగా ఎననుకున్నారు.

పార్టీ నిబందనల ప్రకారం 70 సంవత్సరాల వయసు దాటినవారు రాష్ట్ర కమిటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలి కనుక మాజీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నరసింగరావు, సీతారాములు ముగ్గురూ తప్పుకున్నారు.

అయితే వారు ముగ్గురూ పార్టీలోనే కొనసాగుతూ పార్టీకి అవసరమైన సలహాలు ఇస్తుంటారు. కొత్తగా ఏర్పాటైన సిపిఎం రాష్ట్ర కార్యావర్గంలో మొత్తం 60 మంది సభ్యులు నియమితులయ్యారు.  

సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన జాన్ వెస్లీ వనపర్తి జిల్లా అమరచింత వాస్తవ్యులు. ఆయన 1965, ఫిబ్రవరి 14న జన్మించారు. గద్వాలలో డిగ్రీ చదువుతున్న రోజులలో విద్యార్ధి నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్‌ఎస్‌యూ, పీడీఎస్‌యూ, పీవైఎల్ విభాగాలలో పనిచేసిన జాన్ వెస్లీ 1998లో   సీపీఎంలో చేరారు.

ఆ తర్వాత తన పోరాటాలతో పార్టీలో గుర్తింపు సంపాదించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. జాన్ వెస్లీ మూడుసార్లు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రంగారెడ్డి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న జాన్ వెస్లీ ఇప్పుడు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా జాన్ వెస్లీ ప్రసంగిస్తూ ముందుగా తనని ఈ పదవికి ఎన్నుకునందుకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. వామపక్షాల బలాన్ని ఓట్లు, సీట్లతో కొలవడం సరికాదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటాలను చూడాలన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, నిరుపేదలు, రైతుల తరపున పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకొని విస్తరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తానని జాన్ వెస్లీ అన్నారు.