కేసీఆర్‌ రాజీనామా చేయాలి: మంత్రి కోమటిరెడ్డి

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నల్గొండకు వచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయనకు ఘాటుగా సమాధానం చెప్పారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నేటికీ కేసీఆరే ప్రతిపక్ష నాయకుడు తప్ప కేటీఆర్‌ కాదు. ఆయన కేవలం ఓ ఎమ్మెల్యే మాత్రమే. కనుక ఆయన విమర్శలకు నేను సమాధానం చెప్పక్కరలేదు. 

ఒకవేళ చెప్పాలనుకుంటే కేసీఆర్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, శాసనసభపక్ష నేతగా కేటీఆర్‌ లేదా హరీష్ రావులని నియమించాలి. అప్పుడే మేము వారికి జవాబు చెప్తాం. 

కేసీఆర్‌ ఇంకా ఎంతకాలం ఫామ్‌హౌస్‌లో పడుకుంటారో మాకు తెలీదు కానీ ఒకవేళ ఆయన శాసనసభ సమావేశాలకు రాదలచుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే, ఆయన స్థానంలో మరెవరైనా వస్తారు కదా? 

నేను ఏనాడూ అవినీతికి పాల్పడలేదు. నాపై ఒక్క కేసు కూడా లేదు. కానీ కేటీఆర్‌పై ఎఫ్-1 రేసింగ్ కేసు, ధరణి కేసు ఇంకా మరికొన్ని ఉన్నాయి. వాటిపై విచారణ జరుగుతోంది. కనుక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్‌కి నన్ను ప్రశ్నించే నైతిక హక్కు లేదు,” అని అన్నారు. 

మూసీ ప్రక్షాళన విషయంలో బీజేపి ద్వంద వైఖరి అవలంభిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. “ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపిని గెలిపిస్తే యమునా నది ప్రక్షాళన చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. 

కానీ ఇక్కడ మా ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే అభ్యంతరాలు చెపుతోంది. అసలు మూసీ సమస్యపై రాష్ట్ర బీజేపి నేతలకు అవగాహనే లేదు. వారు మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడుతుండటం ఆశ్చర్యంగా ఉంది,” అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.