పద్మ అవార్డులలో కూడా వివక్షేనా? రేవంత్ రెడ్డి

గణ తంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులపై తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు డా. బీఆర్ అంబేద్కర్ యూనివర్శిటీలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “పద్మా అవార్డుల విషయంలో కూడా కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపడం చాలా బాధాకరం. 

మేము గద్దర్, అందెశ్రీ, చుక్కా రామయ్య, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు పేర్లు పద్మా అవార్డులకు సిఫార్సు చేశాము. కానీ వారిలో ఏ ఒక్కరికీ పద్మ అవార్డు ఇవ్వలేదు. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ ఇచ్చినందుకు చాలా సంతోషం. 

కానీ మేము సిఫార్సు చేసిన ఏ ఒక్కరి పేరు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో తెలియజేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ వ్రాస్తాము. 

యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ద్వారా రాష్ట్రాలలో యూనివర్శిటీలపై పెత్తనం చేస్తూ వైస్ ఛాన్సీలర్ల నియామకాలను తన అధీనంలోకి తీసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇది రాష్ట్రాల హక్కులను హరించడమే. దీనిపై నేను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి కేంద్రంతో పోరాదుతాను,” అని అన్నారు.