నేడు దేశవ్యాప్తంగా ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయపతాకం ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తూ, “తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహాలక్ష్మి పధకం కింద రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. రాష్ట్రంలో 50 లక్షల పేద కుటుంబాలకు గృహజ్యోతి పధకం కింద ఉచిత విద్యుత్ అందిస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
సుమారు 25 లక్షల మందికి పైగా రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాలు ప్రభుత్వం మాఫీ చేసింది. నేటి నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు తదితర పధకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతోంది. అందెశ్రీ వ్రాసిన జయజయహే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం.
రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉన్నందున రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది,” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.