ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. హనుమకొండ, హంటర్ రోడ్డులో సర్వే నంబర్:125-కేలో ఆయన నిర్మించుకున్న అక్రమ కట్టడాలను శుక్రవారం జేసీబీలతో కూల్చివేశారు.
ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ అనుచరులు లేదా కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించవచ్చని భావించిన అధికారులు, పోలీసులను వెంట బెట్టుకువచ్చి భవనాలను కూల్చి వేశారు. దీంతో ఆ ప్రాంతంలో నిన్న ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది కానీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగలేదు.
నగరంలో జ్యోతి, ఈదయ్యలకు చెందిన 400 గజాల స్థలాన్ని మందకృష్ణ మాదిగ ఆక్రమించుకొని ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఆ భవనం నిర్మించుకున్నారని నంబూరి చారుమతి అనే మహిళ రెండున్నరేళ్ళ క్రితమే వరంగల్ మున్సిపల్ అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు పిర్యాదు చేశారు.
ఆమె పిర్యాదు మేరకు 2022 సెప్టెంబర్‌లో అధికారులు విచారణ జరిపి అది అక్రమ కట్టడమేనని కలెక్టర్‌కి తెలియజేశారు. కానీ ఆ తర్వాత అధికారులు ఈ వ్యవహారం గురించి తెలియన్నట్లు మౌనంగా ఉండిపోయారు. దాంతో నంబూరి చారుమతి జాతీయ మానవ హక్కుల కమీషన్‌కి పిర్యాదు చేశారు.
ఆమె పిర్యాదుపై స్పందిస్తూ జనవరి 24లోపు మందకృష్ణ మాదిగ నిర్మించుకున్న అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దానిని ఆయన హైకోర్టులో సవాలు చేసినా న్యాయస్థానం కూడా ఆయన పిటిషన్ తిరస్కరించింది.
హైకోర్టు తరపు నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం రాకపోవడంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు శుక్రవారం మందకృష్ణ మాదిగ నిర్మించుకున్న అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు.