భారత్-పాక్ సంబంధాలు ఇక ఎన్నడూ బాగుపడలేనంతగా చెడిపోయాయి. ఇంకా చెడిపోతూనే ఉన్నాయి కూడా. ఇంతవరకు సరిహద్దులలో భారత్-పాక్ సైనికుల కాల్పులు, దౌత్యవేత్తల బహిష్కరణలు వరకు మాత్రమే చూశాము. తాజాగా అంతకంటే తీవ్రమైన సంఘటన జరిగింది.
భారత్ నేవీకి చెందిన సబ్-మెరైన్ ఒకటి పాక్ జలాలలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిందని, కానీ దానిని పాక్ నేవీ సకాలంలో గుర్తించి అడ్డుకొని బలవంతంగా వెనక్కి త్రిప్పి పంపి వేసిందని పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. భారత్ నేవీ సబ్-మెరైన్ తమ కంటపడకుండా తప్పించుకొని పాక్ జలాలలోకి ప్రవేశించాలని విఫలయత్నాలు చేసిందని, కానీ పాక్ నేవీ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ దానిని వెనక్కి తిప్పి పంపిందని వార్తలు వస్తున్నాయి. అంతే కాదు..పాక్ జలలో ప్రవేశిస్తున్న భారత్ సబ్-మెరైన్ ని పాక్ నేవీ వెనక్కి త్రిప్పి పంపుతున్న ఒక వీడియో క్లిప్పింగుని కూడా పాక్ మీడియా ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్ కి దక్షిణం వైపున్న సముద్రజలాలలో ఈ చొరబాటు ప్రయత్నం జరిగినట్లు పాక్ మీడియా పేర్కొంటోంది.
అయితే పాక్ ఆరోపణలని భారత్ కొట్టిపడేసింది. అసలు భారత్ నేవీకి చెందిన ఏ సబ్ మెరైన్ కూడా అంత దూరం ఎప్పుడూ వెళ్ళలేదని తేల్చి చెప్పింది.
పాక్ చేస్తున్న ఆరోపణలు నిజమో కాదో భారత్-పాక్ ప్రభుత్వాలకి, నేవీ అధికారులకి మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ భారత్ నిజంగా ఆ సాహసం చేసి ఉంటే అది దుస్సాహసమే అని చెప్పక తప్పదు. ఒకవేళ భారత్ ఆ పని చేయకుండా పాక్ ఎందుకు అలాగా చెపుతోంది? అనే సందేహం కలుగక మానదు.
సర్జికల్ దాడుల కారణంగా తమ దేశ ప్రజల ముందు అవమానంతో తలదించుకొన్న పాక్ ఆర్మీ ప్రజలని మభ్యపెట్టేందుకే ఈ డ్రామా ఆడిందేమో? ఒకవేళ భారత్ నిజంగా అటువంటి సాహసం చేసి ఉంటే, పాక్ నేవీ భారత్ సబ్ మెరైన్ పై దాడి చేసి దానిని నిర్బంధించకుండా ఎందుకు వెనక్కి త్రిప్పి పంపేసింది? అనే సందేహం కలుగుతుంది. సర్జికల్ దాడులు, ఉగ్రవాదులపై భారత్ సైనికుల దాడులు, సరిహద్దుకి అవతల ఉన్న పాక్ సైనిక బంకర్స్ దాడులని భారత్ ఆర్మీ వీడియోలు తీసి అప్పుడప్పుడు మీడియాకి విడుదల చేస్తోంది కనుక పాక్ రక్షణ శాఖ కూడా ప్రజలని ఆకట్టుకొనేందుకు తమ స్వంత సబ్ మెరైన్ కే భారత్ జెండా తగిలించి ఈ డ్రామా నడిపించిందేమో? ఏమో ఎవరికీ తెలుసు?