పెద్దపల్లి, ములుగులో టిజిఎస్ ఆర్టీసీ కొత్త బస్టాండ్స్‌

తెలంగాణలో మహాలక్ష్మి పధకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటి నుంచి బస్సులు, బస్టాండ్స్‌ కిటకిటలాడుతున్నాయి. కనుక పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయబోతోంది. రాష్ట్రంలో ప్రయాణీకుల సౌకర్యార్ధం మరిన్ని కొత్త బస్టాండ్స్‌ నిర్మించాలని కొన్నిటిని విస్తరించాలని నిర్ణయించామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. 

రాష్ట్రంలో పెద్దపల్లి (డిపో), ఏటూరు నాగారం, కోదాడ, మధిర, కాళేశ్వరం, ములుగు, హుజూర్ నగర్‌, మంగపేటలో కొత్త బస్టాండ్స్‌ నిర్మాణం కోసం నిధులు విడుదల చేశామని తెలిపారు. 

ఆయన చెప్పిన దాని ప్రకారం కోదాడ బస్టాండ్ నిర్మాణం కొరకు రూ. 17.95 కోట్లు, పెద్దపల్లికి రూ.11.70 కోట్లు, మధిర: 10 కోట్లు, ఏటూరు నాగారం: రూ.6.28 కోట్లు, ములుగు: రూ.5.11 కోట్లు, కాళేశ్వరం: రూ.3.95 కోట్లు, హుజూర్ నగర్‌: రూ.3.75 కోట్లు, మంగపేట: రూ.51 లక్షలు, మంధని బస్టాండ్ విస్తరణకు రూ.95 లక్షలు ప్రభుత్వం నిధులు కేటాయించింది. కనుక త్వరలోనే ఈ కొత్త బస్టాండ్స్‌ నిర్మాణ పనులకు టెండర్లు పిలవనున్నారు.