ఎఫ్-1 రేసింగ్ ఈవెంట్లో రేసింగ్ కార్లు శరవేగంగా దూసుకుపోగా, ఇప్పుడు ఆ కేసులో ఈడీ, ఏసీబీలు పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. ఇప్పటికే ఏసీబీ కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను ప్రశ్నించగా, ఈ ఈవెంట్ నిర్వహణలో తొలి ప్రమోటింగ్ కంపెనీ ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి నోటీసు పంపి ఈ నెల 18 న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఈ ఎఫ్-1 రేసింగ్ ఈవెంట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీతో 2022, అక్టోబర్ 25 న ఓ ఒప్పందం చేసుకుంది. దనాయి ప్రకారం 2023 ఫిబ్రవరి 10,11 తేదీలలో సీజన్-9 రేసింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఒప్పందం ప్రకారం సీజన్ 10,11,12 రేసింగ్ ఈవెంట్ ఖర్చులను ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీయే భరించాలి. కానీ సీజన్-9 తోనే తమకు భారీగా నష్టం వచ్చిందంటూ మిగిలిన సీజన్స్‌లో ఈవెంట్ నిర్వహించకుండా మద్యలో తప్పుకుంది.
అందువల్ల అప్పుడు మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశం మేరకు హెచ్ఎండీఏ ఆ బాధ్యతని తీసుకొని, మిగిలిన సీజన్లు నిర్వహించేందుకుగాను గ్రీన్ కో రేసింగ్ కంపెనీకి రూ.45.71 కోట్లు బ్రిటన్ పౌండ్ల రూపంలో చెల్లించింది. కనుక దీనిని ‘మనీ లాండరింగ్’ వ్యవహారంగా భావిస్తున్న ఏసీబీ, ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి నోటీస్ పంపి విచారణకు ఆహ్వానించింది.
మరోపక్క ఇదే కేసులో ఈడీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి కేటీఆర్‌ని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఇంకా ఈడీ కార్యాలయం నుంచి బయటకు రాలేదు. ఇప్పుడు ఆయనని అరెస్ట్ చేయకుండా హైకోర్టు, సుప్రీంకోర్టు అడ్డుకోవడం లేదు కనుక బహుశః ఈడీ కేటీఆర్‌ని అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. చేస్తే మాత్రం కేటీఆర్‌కి, బిఆర్ఎస్ పార్టీకి కొత్త కష్టాలు మొదలవుతాయి.