ఎఫ్-1 రేసింగ్ కేసులో నేడు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కాబోతున్నారు. ఈ కేసుని కొట్టివేయాలని కోరుతూ ఆయన క్వాష్ పిటిషన్ వేయగా దానిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.. అని వస్తున్న వార్తలలో నిజం లేదని, దానిని తామే వాపసు తీసుకున్నామని బిఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమ భరత్ చెప్పారు.
అయితే కాంగ్రెస్ నేతలు, వారి సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని క్వాష్ పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టేసిందంటూ దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకు కేటీఆర్ చొరవ తీసుకొని నగరంలో ఎఫ్-1 రేసింగ్ ఈవెంట్ నిర్వహింపజేయిస్తే, దానిలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ ప్రతిష్టని దిగజార్చేందుకు ఈవిదంగా తప్పుడు ప్రచారం, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సోమ భరత్ అసహనం వ్యక్తం చేశారు.
బిఆర్ఎస్ వాదనలకు కాంగ్రెస్ పార్టీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ప్రభుత్వ విప్, వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, “కేటీఆర్ పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టేస్తే తామే ఉపసంహరించుకున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటు. సుప్రీంకోర్టు తీర్పు కేటీఆర్‌కి చెంపదెబ్బ వంటిదే.
ఎఫ్-1 రేసింగ్ పేరుతో ప్రజాధనం దోచుకొని దుర్వినియోగం చేసి దానిలో ఎటువంటి అవినీతి జరగలేదని, అసలు ఇది కేసే కాదంటూ కేటీఆర్ ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆయన పిటిషన్లని కొట్టివేశాయి కదా?
అవినీతికి పాల్పడినందుకు కేటీఆర్‌పై చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నాము తప్ప కేసీఆర్ పాలనలో లాగా ఎవరి ఇళ్ళ తలుపులు బద్దలు కొట్టి అరెస్టులు చేయడం లేదు. ఒకవేళ కేటీఆర్ అవినీతికి పాల్పడకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టుకి ఎందుకు పరుగులు తీశారు? ధైర్యంగా ఏసీబీ, ఈడీలను ఎదుర్కొని తాను ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించుకోవచ్చు కదా?” అని ఆదివారం శ్రీనివాస్ ప్రశ్నించారు.