భారత్ నావికాదళంలో కొత్త యుద్ధ నౌకలు, జలాంతర్గాములను జోడిస్తుండటంతో మరింత శక్తివంతంగా మారుతోంది. గత పదేళ్ళలో కొత్తగా 33 యుద్ధ నౌకలు, 7 జలాంతర్గాములు భారత్ నావికాదళంలో వచ్చి చేరాయి.
తాజాగా మరో రెండు యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామిని ప్రధాని మోడీ బుధవారం ముంబయిలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
నావికాదళంలో చేరుతున్న ఇవన్నీ భారత్లో తయారైనవే. అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన అత్యంత శక్తివంతమైనవే. నిన్న నావికా దళానికి అందించిన వాటిలో ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ సూరత్ యుద్ధనౌకలు, ఐఎన్ఎస్ వాగ్షేర్ జలాంతర్గామి ఉన్నాయి.
వీటిలో స్టెల్త్ గైడడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ వంటి అత్యంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఆయుధాలు ఏర్పాటు చేశారు. ఈ రెండింటినీ భారత్ నావికాదళంలోని వార్ షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేయగా ముంబయిలోని మాజ్గావ్ డాక్ యార్డులో వీటిని నిర్మించారు.
స్కార్పియన్ క్లాస్ ప్రాజెక్ట్ 75లో భాగంగా తయారుచేసిన ఐఎన్ఎస్ వాగ్షేర్ జలాంతర్గామి నిర్మాణానికి ఫ్రాన్స్ దేశం తోడ్పడింది.