తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రిగా పాలించినప్పుడు రైతు బంధు పధకం ప్రారంభించారు. దానికి చక్కటి ఆదరణ లభించి కేసీఆర్‌కి, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చింది.
కనుక కాంగ్రెస్ పార్టీ కూడా దానిలో లోపాలను సవరించి మరికొంత సొమ్ము పెంచి రైతు భరోసాగా పేరు మార్చి అమలుచేయబోతోంది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26 నుంచి ఈ పధకాన్ని అమలుచేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పధకానికి మార్గదర్శకాలు జారీ చేసింది.
ఎకరాల పరిమితి లేకుండా సాగులో ఉన్న వ్యవసాయ భూమి అంతటికీ ఈ పధకం వర్తిస్తుంది.
ఏకరాకు రూ.6,000 చొప్పున రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ.12,000 ప్రభుత్వం చెల్లిస్తుంది.
భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ భూములకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
జిల్లా రెవెన్యూ అధికారుల సమక్షంలో జరిగే గ్రామ సభలలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఖరారు చేస్తారు.
గతంలో వ్యవసాయ భూములుగా ఉండి తర్వాత నివాస, వాణిజ్య భూములుగా మార్పిడి జరిగినవాటికి ఈ పధకం వర్తించదు. అటువంటి భూములను భూభారతి రికార్డుల నుంచి తొలగించబడతాయి.
రైతు భరోసా పధకంలో పిర్యాదులను పరిష్కరించే బాధ్యత ఆయా జిల్లా కలెక్టర్లదే అని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ నెల 26 నుంచి మొదలుపెట్టి రెండు వారాలలోగా ఈ పధకం కింద ఆయా రైతుల ఖాతాలలో సొమ్ము జమా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.