హైదరాబాద్‌లో ఉస్మానియా హాస్పిటల్ చాలా చారిత్రికమైనది. ఇక్కడ నిత్యం వేలాదిమంది రోగులు చికిత్స పొందుతుంటారు.
అయితే దశాబ్ధాల క్రితం నిర్మించిన ఉస్మానియా హాస్పిటల్ భవనాలు శిధిలావస్థకు చేరుకుంటున్నా సమైక్య రాష్ట్రంలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వాలు వాటికి తాత్కాలిక చికిత్స(మరమత్తులు)లతో సరిపెట్టాయే తప్ప కొత్త భవనాలు నిర్మించలేకపోయాయి. దానికి అనేక కారణాలున్నాయి. వాటి గురించి అందరికీ తెలుసు. కనుక మళ్ళీ వాటి ప్రస్తావన అనవసరం.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఉస్మానియా హాస్పిటల్‌కి శాశ్విత పరిష్కారంగా కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న భవనాలను కూల్చి వాటి స్థానంలో కొత్తవి కట్టే ప్రయత్నం చేస్తే అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది కనుక ఘోషామహల్ వద్ద పోలీస్ శాఖ అధీనంలో ఉన్న స్థలంలో వీటిని నిర్మించడానికి చకచకా ఏర్పాట్లు చేయిస్తున్నారు.
ఇప్పటికే ఉస్మానియా హాస్పిటల్ నూతన భవన సముదాయం డ్రాయింగ్, డిజైన్లు సిద్దం అయ్యాయి. సిఎం రేవంత్ రెడ్డి శనివారం సచివాలయంలో పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యి దీని గురించి చర్చించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో కార్పొరేట్ హాస్పిటల్‌కు తీసిపోని విదంగా సకల సౌకర్యాలతో నిర్మించబోతున్నామని చెప్పారు. భవిష్యత్‌లో రోడ్ల విస్తరణ, మెట్రో లేదా ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టాల్సి వచ్చినా హాస్పిటల్‌కు ఎటువంటి సమస్య రాకుండా ఉండే విదంగా దీని నిర్మాణం ఉండాలని, అందుకు తగ్గట్లుగా డ్రాయింగులో కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. ఇప్పుడు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
వీలైనంత త్వరగా పోలీస్ శాఖ నుంచి ఆ భూమిని వైద్య ఆరోగ్యశాఖకు బదిలీ చేయాలని, ఈ నెలాఖరులోగా తాను శంకుస్థాపన చేస్తానని అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.