ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు డిల్లీ వెళుతున్నారు. అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే నోట్ల రద్దు వలన రాష్ట్ర ఆదాయం బారీగా పడిపోవడంతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థలో అలారం బెల్స్ మ్రోగడం మొదలయ్యాయి కనుక పరిస్థితులు చెయ్యి దాటిపోక మునుపే ఆయన డిల్లీ వెళ్ళి రాష్ట్ర పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీకి వివరించి కేంద్రప్రభుత్వం సహాయం అర్ధించేందుకు వెళుతున్నారు.
కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె. అరుణ మరో కారణం చెపుతున్నారు. ఆయన తన వద్ద ఉన్న నల్లధనాన్ని వైట్ చేసుకోనేందుకే డిల్లీ వెళ్ళుతున్నారని అన్నారు. దేశంలో తెలంగాణా రెండవ ధనిక రాష్ట్రమని గర్వంగా చెప్పుకొన్న కేసీఆర్ ఇప్పుడు హడావుడిగా డిల్లీకి బయలుదేరి కేంద్ర సహాయం ఎందుకు కోరవలసివస్తోంది? అని ప్రశ్నించారు. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ ఇద్దరూ చాలా నిరంకుశంగా, చాలా అనాలోచితంగా పరిపాలన సాగిస్తున్నారని అరుణ విమర్శించారు.
విదేశాలలో పేరుకు పోయిన నల్లధనాన్ని వెనక్కి తీసుకువచ్చి దేశ ప్రజలకి పంచిపెడతానన్న మోడీ ఆ పని చేయకపోగా, నోట్లు రద్దు చేసి సామాన్య ప్రజలని చాలా ఇబ్బంది పెడుతున్నారని అరుణ విమర్శించారు. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి పాలన కొనసాగిస్తూ మిగులు బడ్జెట్ తో చేతికి అందిన రాష్ట్రాన్ని రెండున్నరేళ్ళలోనే అప్పులపాలు చేశారని అరుణ విమర్శించారు. నరేంద్ర మోడీ, కేసీఆర్ ఇద్దరూ నిరంకుశవాదులేనని అరుణ అభిప్రాయ పడ్డారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలని దృష్టిలో ఉంచుకొనే నరేంద్ర మోడీ ఈ నోట్ల రద్దు నిర్ణయం తీసుకొన్నారని డికె అరుణ అభిప్రాయ పడ్డారు.
ఈరోజు మీడియాలో కేసీఆర్ పర్యటన గురించి మరొక ఆసక్తికరమైన వార్త కూడా వచ్చింది. నోట్ల రద్దు కారణంగా ప్రతిపక్షాలు నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ప్రధాని నరేంద్ర మోడీకి అండగా నిలబడి, కేంద్రం నుంచి అవసరమైన ఆర్ధిక సహాయం పొందడమే కాకుండా, వీలతే తన కుమార్తె కవితకి కేంద్రమంత్రి పదవి ఇప్పించుకోనేందుకే డిల్లీ వెళుతున్నారని వార్త వచ్చింది. ఏమైనప్పటికీ, కేసీఆర్ కేంద్రం నుంచి బారీగా ఆర్ధిక సహాయం రాబట్టుకోవడానికే డిల్లీ వెళుతున్నారని అందరూ అంగీకరిస్తున్నారు.
బ్లాక్‌మనీని వైట్ చేసుకునేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ధనిక రాష్ట్రమన్న కేసీఆర్ ఇప్పుడు కేంద్ర సాయం ఎందుకు అడుగుతున్నారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి తప్ప...అభివృద్ధి కనబడటం లేదని అరుణ పేర్కొన్నారు. మోదీ నిర్ణయంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, విదేశాల్లో వున్న నల్లధనం తీసుకొస్తానన్న హామీ ఏమైందని ఆమె ప్రధాని మోదీని ప్రశ్నించారు. ప్రధాని మోదీ మాటల్లో శాడిజం కనిపిస్తోందని, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల కోసమే రాజకీయ కుట్ర పన్నారని ఆమె అన్నారు.