నోట్ల రద్దు నిర్ణయాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ని ప్రతిపక్షాలకి మోడీ ప్రభుత్వం నచ్చజెప్పలేక, అలాగని వాటిని ఎదుర్కొనలేక చాలా ఇబ్బందిపడుతోంది. భాజపా మిత్రపక్షంగా ఉన్న శివసేన కూడా వాటితో చేతులు కలపడంతో ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులని ఎదుర్కొంటోంది. భాజపాకి వెన్నెముక వంటి ఆర్.ఎస్.ఎస్. కూడా ఇప్పుడు మోడీ నిర్ణయాన్ని తప్పుపడుతోంది. దీనితో మోడీ ప్రభుత్వం చాలా చిక్కుల్లో పడినట్లయింది. ఆర్.ఎస్.ఎస్. నేత గోవిందాచార్య నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ కి ఒక లేఖ వ్రాశారు.
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొన్న ఈ నిర్ణయం కారణంగా దేశ వ్యాప్తంగా 40 మంది మరణించారని, వారి మరణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, వారందరికీ నష్టపరిహారం ఇవ్వాలని లేఖలో వ్రాశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934 చట్ట ప్రకారం కేంద్రప్రభుత్వానికి నోట్లు రద్దు చేసే అధికారమే లేదని గోవిందాచార్య అభిప్రాయపడ్డారు. కేంద్రప్రభుత్వం సరైన అవగాహన, ముందస్తు ఏర్పాట్లు లేకుండా అమలు చేసిన ఈ నిర్ణయం వలన దేశవ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల ప్రాధమిక హక్కులకి కూడా భంగం కలిగిస్తున్నారని విమర్శించారు.
ఇది ఆర్.ఎస్.ఎస్. సంస్థ అభిప్రాయమే అయితే మోడీ ప్రభుత్వానికి కొత్త ఇబ్బందులు తప్పవు. ఒకవేళ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమే అయితే దానిని ప్రభుత్వం పట్టించుకోనవసరం లేదు. కానీ నల్లధనం వెలికి తీయాలని పట్టుబట్టే శివసేన, ఆర్.ఎస్.ఎస్. రెండూ ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తుంటే ఆయనకీ అండగా నిలబడకుండా ఈ విధంగా విమర్శించడం చాలా శోచనీయం.