పోలీసులపై నమ్మకం లేదు: కేటీఆర్‌

ఫార్ములా 1 రేసింగ్ కేసులో ఏ-1 నిందితుడుగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్‌ సోమవారం ఉదయం ఏసీబీ కార్యాలయానికి తన న్యాయవాదులతో కలిసి వచ్చారు. కానీ లోనికి ఆయన ఒకరినే అనుమతిస్తామని చెప్పి పోలీసులు వారిని అడ్డుకోవడంతో, కేటీఆర్‌ లోనికి వెళ్ళకుండా బయట కారులోనే 40 నిమిషాల సేపు కూర్చున్నారు. 

పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఒప్పుకోలేదు. తనకు పోలీసులపై నమ్మకం లేదని, ఇంతకు ముందు పట్నం నరేందర్ రెడ్డిని కూడా ఇలాగే ఒంటరిగా విచారణకు పిలిచి ఆయన చెప్పని విషయాలు చెప్పిన్నట్లు రికార్డులో నమోదు చేశారని కేటీఆర్‌ ఆరోపించారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని అందుకే విచారణకు హాజరయ్యానని, కానీ పోలీసులే రాజ్యాంగాన్ని గౌరవించకుండా సిఎం రేవంత్ రెడ్డి కనుసన్నలలో పనిచేస్తూ తనని ఈ కేసులో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. 

తాను ఇక్కడ విచారణకు వచ్చినప్పుడే, ఏసీబీ అధికారులు సోదాల పేరుతో తన ఇంట్లోకి ప్రవేశించి తప్పుడు పత్రాలు, వస్తువులు పెట్టేందుకు కుట్ర చేయబోతున్నట్లు తనకి పక్కా సమాచారం ఉందని కేటీఆర్‌ ఆరోపించారు. 

దాదాపు 40 నిమిషాల సేపుఏసీబీ కార్యాలయం వద్ద ఈ డ్రామా సాగిన తర్వాత ‘న్యాయవాదులు లేకుండా తాను విచారణకు హాజరుకాబోనని తేల్చి చెప్పేశారు.

ఈ కేసుని కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో తాను వేసిన పిటిషన్‌పై ఏ క్షణంలోనైనా తీర్పు వెలువడే అవకాశం ఉంది కనుక అంతవరకు తనకు సమయం ఇవ్వాలని కోరుతూ కేటీఆర్‌ లిఖిత పూర్వకంగా ఓ లేఖ సమర్పించి తిరిగి వెళ్ళిపోయారు. ఏసీబీ అధికారులు కేటీఆర్‌కి మళ్ళీ మరోసారి  నోటీస్ పంపే అవకాశం ఉంది.