భాజపా మంత్రి గారి కారులోనే బ్లాక్ మనీ

దేశంలో పాత నోట్లని రద్దు చేసిన తరువాత రోజూ చిత్రవిచిత్రమైన వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నల్లధనం దాచుకొన్నవారు దానిని వదిలించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి వస్తున్న వార్తలు చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి. కొందరు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని నదులు, మురికి కాలువలు, చెత్తకుండీలలో పడేస్తుంటే, మరికొందరు దేవుడి హుండీలలో పడేసి పుణ్యం సంపాదించేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. కొందరు వాటిని చించివేస్తున్నారు..కాల్చి వేస్తున్నారు. కొందరు నిరుపేదలకి ఎంతో కొంత ఆశ చూపించి వారి అకౌంట్లలో ఆ డబ్బుని జమా చేసి తెల్లధనంగా మార్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. 

తాజాగా బయట పడిన వార్త ఏమిటంటే, సామాన్య ప్రజలు బ్యాంకులలో తాకట్టు పెట్టుకొన్న బంగారు ఆభరణాలని నల్లకుభేరులు విడిపించి ఇస్తున్నారుట! ఊరకనే కాదు..వడ్డీలేని అప్పుగా ఇస్తున్నారుట! అందుకు అంగీకరించిన వాళ్ళ దగ్గర నుంచి ముందుగా ప్రామిసరీ పత్రాలు, లేదా పోస్ట్ డేటడ్ చెక్కులు తీసుకొని వారి నగలు విడిపించుకోవడానికి వారికి ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తున్నారుట! ఇచ్చిన సొమ్ముని బట్టి ఆరు నెలలు నుంచి ఏడాది వరకు గడువు ఇస్తున్నారుట!

మహారాష్ట్ర సహకార శాఖా మంత్రి సుభాష్ దేశ్ ముఖ్ (భాజపా)కి చెందిన లోకేష్ గ్రూప్ వాహనంలో రూ.91.5 లక్షలు తరలిస్తుంటే పోలీసులు పట్టుకొన్నారు. ఈ విషయాన్నీ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ నార్నవార్ దృవీకరించారు కూడా. రాష్ట్రంలోని ఉస్మానాబాద్ జిల్లాలో నిన్న రాత్రి ఆ డబ్బు పట్టుబడింది. అయితే అది తమ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకి జీతాలు చెల్లించేందుకు తీసుకువెళుతున్న సొమ్మని మంత్రిగారు బుకాయిస్తున్నారు.  సాధారణంగా నెల మొదట్లో కంపెనీలు తమ కార్మికులకి జీతాలు చేల్లిస్తుంటాయి. కానీ నిన్న ఇంకా 17వ తేదీ మాత్రమే అంటే మంత్రిగారు అబద్దం చేపుతున్నరన్నామాట! బహుశః ఆ సొమ్ముని తన కార్మికుల బ్యాంక్ ఖాతాలలో వేసి తెల్లధనంగా మార్చుకోవాలనుకొన్నారేమో అని అనుమానించక తప్పదు. 

ఒకవైపు పార్లమెంటు లోపల, బయటా ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తుంటే, భాజపాకే చెందిన నేత, మంత్రిగా ఉన్న సుభాష్ దేశ్ ముఖ్ వద్ద నుంచి అంత బారీగా నల్లధనం బయటపడటం భాజపాకి, కేంద్రప్రభుత్వానికి కూడా చాలా ఇబ్బంది కలిగించే విషయమే. సుభాష్ దేశ్ ముఖ్ ని తక్షణమే పదవిలో నుంచి తొలగించాలని ఎన్.సి.పి. అధినేత శరత్ పవార్ డిమాండ్ చేస్తున్నారు.