రేవంత్ రెడ్డి గత ఏడాది ముఖ్యమంత్రి కాగానే దావోస్ సదస్సులో పాల్గొని వచ్చారు. ఈ ఏడాది కూడా దావోస్ సదస్సులో పాల్గొనేందుకు బయలుదేరుతున్నారు. ఈ నెల 14న బయలుదేరి ముందుగా ఆస్ట్రేలియాలో పర్యటించి అక్కడి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశం అవుతారు.
అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళి రెండు రోజులు పర్యటించి అక్కడి పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులతో సమావేశంమవుతారు. ఆ తర్వాత దావోస్ చేరుకొని ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొంటారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవానికి ముఖ్యమంత్రి హాజరు తప్పనిసరి కనుక ఒకరోజు ముందు హైదరాబాద్ చేరుకుంటారు.
గత ఏడాది ముఖ్యమంత్రిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆశించిన స్థాయిలో పెట్టుబడులు సాధించలేకపోయారు. కానీ ఈసారి ఏడాది పాలన అనుభవంతో పరిశ్రమలు, పెట్టుబడుల గురించి పూర్తి అవగాహనతో వెళుతున్నారు.
ఈ ఏడాది కాలంలో ముఖ్యమంత్రి హోదాలో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు కనుక మంచి పరిచయాలు కూడా ఏర్పడ్డాయి. కనుక ఈసారి సిఎం రేవంత్ రెడ్డి దావోస్ సదస్సులో, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాలలో పర్యటనలలో తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు సాధించుకువచ్చే అవకాశం ఉంది.