కేటీఆర్‌ ఇవేం మాటలు?

ఇటీవల సిఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం కావడంపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై టిఎఫ్‌డీ ఛైర్మన్‌ దిల్‌రాజు అభ్యంతరం తెలుపుతూ ఓ లేఖ విడుదల చేశారు. దానిలో కేటీఆర్‌ వ్యాఖ్యలను తప్పు పట్టారు. 

ఇంతకీ కేటీఆర్‌ ఏమన్నారంటే, “రేవంత్ రెడ్డి సమస్యలపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు, తన సొంత ప్రచారం కోసమే సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఇది డైవర్షన్ పాలిటిక్స్, అటెన్షన్ పాలిటిక్స్ కోసమే రేవంత్ రెడ్డి ఈ అంశంతో హడావుడి చేస్తున్నారు. సమావేశంలో సినిమా వాళ్ళతో సెటిల్ చేసుకున్నాక ఇప్పుడేమీ మాట్లాడటం లేదు,” అని అన్నారు. 

దీనికి సమాధానంగా దిల్‌రాజు విడుదల చేసిన లేఖలో ఘాటుగానే స్పందించారు. “ముఖ్యమంత్రితో సమావేశంపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. మా సమావేశం ఏమీ ఒకరిద్దరితో చాటుమాటుగా జరుగలేదు. తెలుగు సినీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడం, గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు హైదరాబాద్‌ కేంద్రంగా మార్చడం అనే అంశాలపై చర్చ జరిగింది. సిఎం రేవంత్ రెడ్డి సూచనలను యావత్ తెలుగు సినీ పరిశ్రమ స్వాగతించింది. కనుక తెలుగు సినీ పరిశ్రమని లేనిపోని వివాదాలలోకి లాగి మాకు రాజకీయాలు ఆపాదించవద్దని మనవి చేస్తున్నాను. మీ రాజకీయాలను సినీ పరిశ్రమని వాడుకోవద్దని, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సినీ పరిశ్రమకి ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పడుతుంటే దానిని దెబ్బ తీయవద్దు,” దిల్‌రాజు విజ్ఞప్తి చేశారు.