ఈరోజు సాయంత్రం నుంచి అర్దరాత్రి వరకు హైదరాబాద్‌లో పలు ప్రాంతాలలో నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పే వేడుకలు అట్టహాసంగా జరుగబోతున్నాయి. కానీ మందు కొట్టి రోడ్లపై అత్యుత్సాహం ప్రదర్శిస్తే కొత్త సంవత్సరం జైలులో గడపాల్సి ఉంటుందని పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది.
ఈరోజు అర్దరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలకు, రాత్రి ఒంటి గంటవరకు పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్స్‌కు ఎక్సైజ్ శాఖ అనుమతి మంజూరు చేసింది. కానీ మద్యం దుఖాణాల వద్ద, ముఖ్యంగా పబ్బులు, న్యూఇయర్ ఈవెంట్స్‌పై పోలీస్ నిఘా ఉంటుంది. ఎవరైనా మాదక ద్రవ్యాలు సరఫరా, సేవిస్తూ పట్టుబడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ హెచ్చరించింది.
నగరం పరిధిలో న్యూఇయర్ ఈవెంట్స్ నిర్వహించుకునేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని, నియమ నిబంధనలకు లోబడి ఈవెంట్స్ నిర్వహించుకోవలసి ఉంటుందని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.
న్యూఇయర్ ఈవెంట్స్ సందర్భంగా ఈరోజు అర్దరాత్రి పెద్ద ఎత్తున రోడ్లపైకి జనం వస్తారు కనుక వారి భద్రత, ప్రజల భద్రత కొరకు నగరంలో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీస్ విభాగం తెలియజేసింది.
నగరంలో అవుటర్ రింగ్ రోడ్డుపై కార్లు, బైకులు, స్కూటీలు, ప్యాసింజర్ వెహికల్స్ ప్రయాణించేందుకు అనుమతి ఉండదు. అలాగే నగరంలో కామినేని, నాగోల్, ఎల్బీ నగర్, బైరామల్, చింతలకుంట తదితర ఫ్లై ఓవర్లు, ఎక్స్‌ప్రెస్ రోడ్లని మూసివేయబడతాయి.
కానీ సరుకు రవాణా వాహనాలకు, అంబులెన్సులకు ఈ ఆంక్షలు వర్తించవు. అవి అవుటర్ రింగ్ రోడ్‌తో సహా అన్ని మార్గాలలో యధాప్రకారం ప్రయాణించవచ్చు.
విమానాశ్రయానికి కార్లలో వెళ్ళే ప్రయాణికులు టికెట్స్ చూపించితే అవుటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించేందుకు అనుమాటిస్తామని ట్రాఫిక్ పోలీస్ విభాగం పేర్కొంది.
ఈ ఆంక్షలు మంగళవారం రాత్రి 11 గంటల నుంచి బుధవారం (జనవరి 1) ఉదయం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీస్ విభాగం తెలిపింది. కనుక ప్రజలు వీటిని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలలో తమ గమ్య స్థానాలు చేరుకోవాలని సూచించింది.