రేవంత్ లేఖకి చంద్రబాబు జవాబు.. ఏమన్నారంటే..

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి డిసెంబర్‌ 16న ఓ లేఖ వ్రాశారు. దానిలో తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు శ్రీవారి ప్రత్యేక దర్శనాలకు, ఆర్జిత సేవల కొరకు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే సిఫార్సు లేఖలు టీటీడీ అనుమతించాలని సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణ ప్రజలకు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిపై వందల సంవత్సరాలుగా విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందని, అందువల్ల తెలంగాణ నుంచి ప్రతీరోజూ కొన్ని వేలమంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారని, వారి సంఖ్య ప్రతీ సంవత్సరం ఇంకా పెరుగుతూనే ఉందని పేర్కొన్నారు. 

కనుక తన ఈ అభ్యర్ధనని మన్నించి ఇదివరకు పాటించిన ఆనవాయితీ ప్రకారం మళ్ళీ తెలంగాణ ప్రజా ప్రతినిధులిచ్చే సిఫార్సు లేఖలను అనుమతించాలని సిఎం రేవంత్ రెడ్డి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 

ఇటీవలే బిఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మంత్రి కొండా సురేఖ కూడా తిరుమలలో తెలంగాణ భక్తులకు, ప్రముఖులకు ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 

ప్రస్తుతం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మద్య, ముఖ్యమంత్రుల మద్య ఇప్పుడు సత్సంబందాలు ఉన్నందున ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు వెంటనే స్పందిస్తూ డిసెంబర్‌ 30న జవాబిచ్చారు. 

సోమవారం నుంచి గురువారం వరకు వారంలో రెండు రోజులు సిఫార్సు లేఖలు అనుమతిస్తామని తెలియజేశారు. రూ.500 టికెట్‌తో విఐపీ బ్రేక్ దర్శనం కొరకు రెండు లేఖలు, రూ. 500 టికెట్‌తో స్పెషల్ ఎంట్రీ దర్శన్ కొరకు రెండు లేఖలు స్వీకరించబడతాయని తెలియజేశారు. ఓ లేఖ ద్వారా ఆరుగురు భక్తులను సిఫార్సు చేయవచ్చని తెలియజేశారు.