బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు కొత్త డిమాండ్ పెట్టారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు.
ప్రభుత్వం బీసీ జనాభా వివరాలు, బీసీ కమీషన్ నివేదికని ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. లేకుంటే ఎన్నికలు జరగనివ్వబోమని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
దీని కోసం ముందుగా జనవరి 3న ఇందిరా పార్కు వద్ద బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల సంక్షేమం కోసం బడ్జెట్లో రూ.20,000 కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పింది. ఏడాది పాలన పూర్తయినా ఇంకా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
శనివారం ఉదయం బీసీ సంఘాలకు చెందిన సుమారు 40 మంది కల్వకుంట్ల కవితని ఆమె నివాసంలో కలిసి బీసీ రిజర్వేషన్లు, వాటి కోసం చేయాల్సిన పోరాటాలు, కార్యాచరణ గురించి చర్చించారు.