హైడ్రా కమీషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మేము ప్రస్తుతం నగరంలో చెరువులు, కుంటల ఆక్రమణలను ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించే పనిలో ఉన్నాము. త్వరలోనే ఆ వివరాలను హైడ్రా అధికారిక వెబ్ సైట్లో పెడతాము. ఈ పని పూర్తయిన తర్వాత మళ్ళీ ఆక్రమణలు తొలగించే పని ప్రారంభిస్తాము.
కనుక కొత్తగా ఇళ్ళు నిర్మించుకునేవారు, కొనుగోలుచేయాలనుకునేవారు ముందుగా అవి ఎఫ్టీఎల్ పరిధిలో లేవని ధృవీకరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటి వరకు నగరంలో 1200 చెరువులను గుర్తించాము. కనుక ముఖ్యంగా చెరువులు, నాలాలకు సమీపంలో ఉన్న లేఅవుట్స్ విషయంలో ప్రజలు మరింత జాగ్రత్త పడటం మంచిది.
హైడ్రా అంటే కూల్చివేతలే అనే తప్పుడు అభిప్రాయం ప్రజలలో నెలకొనడానికి కారణం భూ మాఫియాయే కారణం. వారు పేద ప్రజలని అడ్డం పెట్టుకొని హైడ్రా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను కబ్జా అవుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? ఇప్పటి వరకు మేము 300 ఎకరాలు కబ్జాల నుంచి విడిపించాము. కబ్జాల నుంచి విముక్తి పొందిన చెరువుల పునరుద్దరణకు సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందించాము. ప్రభుత్వం ఆమోదం తెలుపగానే ఆ పనులు మొదలుపెడతాము. హైడ్రా కోసం ప్రత్యేకంగా ఓ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తాము. భూకబ్జాలకు సంబందించి ప్రజల పిర్యాదులను స్వీకరించి తగు చర్యలు చేపడతాము,” అని చెప్పారు.