మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ మృతి

మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. గురువారం రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 9.51 గంటలకు కన్నుమూశారు. 

ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న సామాన్య మద్యతరగతి కుటుంబంలో జన్మించిన డా. మన్మోహన్ సింగ్, ఆర్ధికమంత్రిగా దేశ ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ళపాటు ప్రధాన మంత్రిగా చేశారు. 33 ఏళ్ళపాటు రాజ్యసభ సభ్యుడుగా చేశారు. 

దివంగత ప్రధాని పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్ధికమంత్రిగా ఉన్నప్పుడు ఇరువురూ కలిసి నూతన ఆర్ధిక విధానాలు, సంస్కరణలు అమలుచేసి అప్పులలో కూరుకుపోయిన దేశాన్ని కాపాడటమే కాక ఆర్ధికాభివృద్ధి చేసి చూపిన ఘనులుగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయారు. 

డా. మన్మోహన్ సింగ్‌కు భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ, దేశంలో అధికార ప్రతిపక్ష నేతలు, ఆర్ధిక రంగా నిపుణులు, పారిశ్రామికవేత్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

డా. మన్మోహన్ సింగ్‌ మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేస్తూ, రాష్ట్రంలో వారం రోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలని ప్రకటించింది. నేడు (శుక్రవారం) రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.