జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ నేటికీ సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొన్న ఆ నిర్ణయం వలన అధికార తెరాసతో సహా అన్ని పార్టీలకి మేలే జరుగుతోందనే విషయం అవి పైకి చెప్పకపోయినా తెలుస్తూనే ఉంది. రాష్ట్రంలో 17 కొత్త జిల్లాలు ఏర్పాటు అవడంతో అన్ని పార్టీలలో రాజకీయ నిరుద్యోగులకి పదవులు దక్కుతున్నాయి. ఒక్కో జిల్లాలో జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి ఇలాగ ఎంత తక్కువ వేసుకొన్నా కనీసం 10 మందికి రాజకీయ ఉద్యోగాలు లభిస్తున్నాయి. అంటే 17 జిల్లాలకి కలిపి ఒక్కో పార్టీలో కొత్తగా 170 రాజకీయ ఉద్యోగాలు (పదవులు) కేసీఆర్ సృష్టించి ఇచ్చారన్న మాట! ఆ పదవులు పొందుతున్నవారు ఒక పక్క సంతోషపడుతుంటే, ఆ పార్టీలు మాత్రం జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందంటూ ఇంకా సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉండటం విచిత్రం.
కేసీఆర్ నిర్ణయాన్ని తప్పు పట్టుతున్న వాటిలో భాజపా కూడా ఒకటి. ఒకపక్క తప్పు పడుతూనే కొత్త జిల్లాలకి అధ్యక్షులని, కార్యవర్గాలని నియమించుకొంటూనే ఉంది. నిన్న 10 జిల్లాలకి అధ్యక్షులని నియమించింది. త్వరలోనే హైదరాబాద్, సూర్యాపేటకి కూడా అధ్యక్షులని నియమిస్తామని ఆ పార్టీ నేత భూపతి రెడ్డి తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష పదవికి పద్మజా రెడ్డి, కొండయ్య పోటీ పడటంతో నిన్న అధ్యక్ష పదవి నియామకం అవుతున్న సమయంలో ఇరు వర్గాల మద్య ఘర్షణ జరిగింది. కానీ ఎన్నికల పరిశీలకుడుగా వ్యవహరించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే రామచంద్రా రెడ్డి సూచన మేరకు పద్మజా రెడ్డినే మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షురాలిగా నియమించారు.
కొత్తగా నియమింపబడిన జిల్లా అధ్యక్షుల పేర్లు: మహబూబ్ నగర్: పద్మజా రెడ్డి, యాదాద్రి: పివి శ్యాం సుందర్ రావు, గద్వాల: శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం; ఎస్. ఉదయ్ ప్రతాప్, కామారెడ్డి: బి. లకష్మ రెడ్డి, నాగర్ కర్నూల్: నాగం శశిధర్ రెడ్డి, వనపర్తి: అయ్యంగారి ప్రభాకర్, మేడ్చల్: ఎమ్మెల్యే.కాంతారావు , నల్గొండ: ఎన్.నరసింహ రెడ్డి, వికారాబాద్: కె. ప్రహ్లాద రావు.