ముఖ్యమంత్రి నివాసం అంటే మాటలా?

ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం హైదరాబాద్ లోని గ్రీన్ ల్యాండ్స్ వద్ద అధికార నివాసం నిర్మించబడుతోంది. అందులోనే ఆయన క్యాంప్ కార్యాలయం కూడా ఉంటుంది. దాని వలన ఆయన బయటకి అడుగు పెట్టకుండానే పరిపాలన చేయవచ్చు. 

సుమారు రూ.50 కోట్లు వ్యయంతో సుమారు 9 ఎకరాలలో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆయన కార్యాలయం, మరో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అధికారిక నివాసం నిర్మించబడుతోంది. మొత్తం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు బ్లాకులుగా ఈ భవనం నిర్మించబడుతోంది. పై అంతస్తులో ముఖ్యమంత్రి నివాసం, క్రింద అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటాయి. ముఖ్యమంత్రి నివాసంలో 6 బెడ్ రూములు, డైనింగ్ హాల్, విశాలమైన, అత్యాధునికమైన కిచెన్, పూజగది వంటి వన్నీ షరా మామూలే. జిమ్ సెంటర్, లైబ్రేరీ వంటి అన్ని అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. వాస్తు ఎలాగూ పక్కాగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.       

అయన కార్యాలయంలో మంత్రులు అధికారులతో సమావేశం కావడానికి పెద్ద కాన్ఫరెన్స్ హాల్, ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చినవారు వేచి ఉండటానికి మరొక పెద్ద వెయిటింగ్ హాల్, వీడియో కాన్ఫరెన్సింగ్ హాల్, అతిధుల కోసం ప్రత్యేకంగా గదులు, ఉంటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 24వ తేదీన దానిలోకి మారే అవకాశం ఉంది.